నేడు బీజేపీలోకి ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బృందం సోమవారం హస్తినలో కాషాయ కండువా కప్పుకోనుంది. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటల తర్వాత ఈటల రాజేందర్‌, ఇతర నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకుని.. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. తనతోపాటు పార్టీలో చేరే నేతలు, బీజేపీనాయకులు దిల్లీ వెళ్లడానికి రాజేందర్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈటల రాజేందర్‌ 15న దిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగిరానున్నారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.