ఎల్ఓసీ వెంట పేలిన పేలిన మందుపాతర: ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకాశ్మీర్‌లో నౌషెరా-సుందర్‌బనీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖకు సమీపాన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ సిబ్బంది…ల్యాండ్‌మైన్‌ పైకి వెళ్లగా.. అది పేలడంతో ఓ అధికారితో పాటు జవాన్‌ ప్రాణాలు విడిచినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులు లెఫ్టినెంట్‌ రిషి కుమార్‌, జవాను మంజిత్‌ సింగ్‌ ధైర్యవంతులని, వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉండేవారని, ఇప్పుడు ఆ విధి నిర్వహణలో తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారని జమ్ము ప్రాంత రక్షణ శాఖ ప్రతినిధి అన్నారు. రిషీ బీహార్‌లోని బెగుసరారు ప్రాంతానికి చెందిన వారని, సిపాయి మంజిత్‌ పంజాబ్‌లోని భటిండాలోని సిర్వేవాలా నివాసి అని తెలిపారు. వారి అత్యున్నత త్యాగాలకు, ధైర్య సాహసాలకు దేశం, భారత సైన్యం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.