ఓటరు కార్డుల పరిశీలన గడువుని పెంచండి: నేరేళ్ళ సురేష్

  • జిల్లా కలెక్టర్ ను కోరిన గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు జరుగుతున్న ఓటరు పరిశీలన కార్యక్రమ గడువుని పెంచాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డిని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ కోరారు. సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు జనసేన పార్టీ శ్రేణులు ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఓటు పరిశీలన కార్యక్రమంలో నెలకొన్న పలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఓట్లు పరిశీలన కార్యక్రమం మందకొడిగా సాగుతోందన్నారు. ప్రధానంగా ఓటు పరిశీలనకు చెందిన ఓటరు హెల్ప్ లైన్ యాప్ నెమ్మదిగా స్పందిస్తుందని ఈ నేపధ్యంలో ఓటు పరిశీలన కార్యక్రమ గడువుని పొడిగించాలన్నారు. కొత్తగా ఇచ్చిన ఇంటి నెంబర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో బీ యల్ ఓ లకు సైతం అర్ధం కావటం లేదని నేరేళ్ళ సురేష్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓటు పరిశీలన కార్యక్రమం సక్రమంగా సాగుతుందని, ఆన్లైన్ యాప్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యతో ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సాగిందన్నారు. ఓటు పరిశీలన కార్యక్రమ వివరాలను ప్రతీరోజూ క్షేత్రస్థాయిలో ఈఆర్వోలు, ఏ ఈఆర్వోలు పర్యవేస్తున్నారన్నారు. ఓటు నమోదు ప్రక్రియలో బీయల్వోలకు ఎదురైన అంశాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఓటు పరిశీలన గడువుని పెంచమని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కి తాము కూడా తెలియచేస్తామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్సులు కటకంశెట్టి విజయలక్ష్మి, యడ్ల నాగమల్లేశ్వరరావు, కార్యదర్శి పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.