ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 150 మంది ఉద్యోగుల గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఆదివారం ఉదయం నందాదేవి గ్లేసియర్ విరిగి పడటంతో ధౌలిగంగా నదిలో వచ్చిన ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదలో 100 మందికిపైగా మృతి చెందినట్లు భావిస్తున్నారు. అక్కడి రిషి గంగా పవర్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సుమారు 150 మంది కార్మికులు ఈ వరదలో కొట్టుకుపోయారు. వీళ్లలో ఇప్పటి వరకూ 10 మంది మృతదేహాలను వెలికి తీయగలిగారు. వందల మంది ఐటీబీపీ, ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మూడు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ వరదలో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి.

కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉత్తరాఖండ్ లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఘటనపై అమిత్ షా ఆరా తీశారు. ప్రస్తుతం ధౌలిగంగా పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ విధించారు. సహాయచర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి స్పందించారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఉమాభారతి దీనిపై ట్వీట్ చేస్తూ…. హిమాలయ పర్వత ప్రాంతం ఎంతో సున్నితమైనదని, గంగానది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించకపోవడమే మంచిదని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే విజ్ఞప్తి చేశానని వివరించారు