అంగన్వాడీలపై కక్షపూరిత చర్యలు దుర్మార్గం

  • అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడటం జగన్ రెడ్డికి తగదు
  • గద్దె ఎక్కించిన వారికి – దించటమూ తెలుసు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు, బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. గుంటూరు కలక్టరేట్ ఎదుట జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా జనసేన శ్రేణులు శనివారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద, దిగువ మధ్య తరగతి ప్రజాలేనన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో అంగన్వాడీల జీవితాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ల సమస్యలను పెద్ద మనసుతో అర్ధం చేసుకొని జగన్ రెడ్డి పరిష్కరించాలన్నారు. పంతాలకు, పట్టింపులకు పోయి వారి జీవితాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ సమ్మె వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయనటం సజ్జల రామకృష్ణ రెడ్డికి తగదన్నారు. సమ్మె వెనుక అంగన్వాడీల వేదన, జీవన పోరాటం ఉందన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగటం సజ్జల దృష్టిలో పెద్ద తప్పుగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం లోని అన్నివర్గాల ప్రజలు జగన్ రెడ్డి అసమర్ధ, అవినీతి, దుర్మార్గపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. గద్దెని ఎక్కించిన వారికి ఆ గద్దెని దించటం కూడా బాగా తెలుసున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పండగ అనంతరం ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నాయకులు గడ్డం రోశయ్య, గుర్రాల ఉమ, రాజేష్, వెంకట్, సీ ఐ టీ యు నాయకులు కే వెంకటేశ్వర్లు, ముత్యాలరావు, ఉద్యమ నాయకుర్రాళ్ళు రాధా, వెంకాయమ్మ, జెర్సీ, దీప్తి తదితరులు పాల్గొన్నారు.