హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఆస్తినష్టం భారీగా ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ గౌలిగూడలోని ఓ లెదర్‌ షాపులో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఈ షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మూడంతస్తుల ఈ భవనంలో సాగర్ అనే వ్యాపారి లెదర్ షాపును నిర్వహిస్తున్నారు. స్కూల్ బ్యాగులు, లెదర్ బెల్టులు, షూస్‌లను విక్రయిస్తున్నాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో షాపును మూసి వెళ్లాడు.

10:30 గంటల సమయంలో మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. భవనం మొత్తాన్ని వ్యాపించాయి. 70 శాతం వరకు భవనం కాలిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో షాపును మూసివేసి ఉంచడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అన్నారు.

లెదర్ వస్తువులు కావడం వల్ల ఘాటు వాసనతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెస్, దానికి ఆనుకుని భవానీ లాడ్జ్ ఉన్నాయి. ఘాటు వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సాధారణంగా గౌలిగూడ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కొనుగోలుదారులతో క్రిక్కిరిసి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇంతకుముందులా అక్కడి వాతావరణం కనిపించట్లేదు. కరోనా వైరస్ వల్ల వ్యాపారం మందగించడం వల్ల యజమాని త్వరగా షాపును మూసి ఇంటికెళ్లాడని, సాధారణ రోజుల్లో 10 గంటల వరకు తెరిచి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.