మయన్మార్‌లో కొనసాగుతున్న నిరసన..సైన్యం కాల్పుల్లో 9మంది మృతి

యాంగూన్‌: మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. పలు నగరాల్లోని వీధుల్లో నిరసనలు తెలుపుతున్న వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లో బుధవారం 9మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది మరణించారు. గత నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో సైన్యం ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనంతరం కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎక్కువ మంది చిన్నారులు గాయపడినట్టు సమాచారం. పెద్ద నగరాలైన యాంగూన్, మాండలే సహా పలు ప్రాంతాల్లోని ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపిందని అక్కడి మీడియా పేర్కొంది.