మత్స్యకారుల సమస్యలు గాలికొదిలి ముఖ్యమంత్రి చేపలు అమ్ముకోవడం ఏమిటి

*మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి జనసేన లక్ష్యం సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
*సూర్యారావుపేటలో మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించిన నాదెండ్ల మనోహర్

మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన ముఖ్యమంత్రే వారి కడుపు కొట్టే విధంగా చేపలు అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలు ఇప్పుడు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. వారి సర్వతోముఖాభివృద్ధి పార్టీ లక్ష్యమన్నారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్రను ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం, సూర్యారావుపేటలో ప్రారంభించారు. తొలుత స్థానిక మారమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పార్టీ పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేశ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం పార్టీలో ప్రత్యేక విభాగాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటైన దగ్గర నుంచి తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల స్థితిగతులు, వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తుంది.

*200 కుటుంబాలను ఖాళీ చేయించిన మంత్రి పరిహారం మాట మరిచారు

అభివృద్ధి పేరిట స్థానిక శాసనసభ్యుడు, మంత్రి దగ్గరుండి దాదాపు 200 మత్స్యకార కుటుంబాలను ఇక్కడ నుంచి ఖాళీ చేయించి తరలించారు. వారికి తగిన నష్టపరిహారం ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. నేడు పరిహారం మాట మరిచారు. ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు. మంత్రి అయి ఉండి కూడా కూలీ పనులు చేసుకునే మత్స్యకారుల కుటుంబాల్లో ధైర్యం నింపకపోవడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, మహిళల కోసం మరుగుదొడ్లు, పాఠశాలల ఏర్పాటు కోసం మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం.

*ఆ హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారూ..

సముద్రంలో వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతి చెందితే కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఈ రోజు వరకు కేవలం 64 కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మాత్రమే నష్టపరిహారం అందించారు. గత ఏడాది అయితే ఒక్క కుటుంబానికి కూడా ఎక్స్ గ్రేషియా అందించలేదు. పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఈరోజు ప్రమాదవశాత్తు మృతిచెందిన జనసైనికుల కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందిస్తున్నారు. అధికారంలో లేని పవన్ కళ్యాణ్ అంత చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ప్రభుత్వం ఎందుకు రూ. 10 లక్షలు ఇవ్వలేకపోతుంది. మత్స్యకారుల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. యువతకు ఉపాధి కల్పించేలా, మత్స్యకార కుటుంబాల్లో భరోసా నింపేటట్లు పనిచేస్తాం. మహిళలు రోడ్లపై కూర్చొని చేపలు అమ్ముతున్నారు. వారి జీవన విధానం మారేలా చిన్న చిన్న స్టోరేజీలు ఏర్పాటు చేస్తామ”ని హామీ ఇచ్చారు.

*వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు, జనసైనికులు

సూర్యారావుపేటలో మొదలైన యాత్ర వలసపాకల, గంగరాజు నగర్ మీదుగా సాగింది. వేలాదిగా మత్స్యకారులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నియోజక వర్గం ఇంచార్జులు, మత్స్యకార వికాస విభాగం సభ్యులు పాల్గొన్నారు.