ఫ్లోరైడ్ బాధితుల గోడు పట్టని పాలకులు

*కిడ్నీ వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతం
*వ్యాధిపీడితుల పక్షాన నిలబడతామంటూ పవన్ కళ్యాణ్ వాగ్దానం

కాలుష్య రహితమైన నీరు తాగడం కనీస మానవ హక్కు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మందికి ఈ హక్కు దూరం అవుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. సమస్యలు ఎత్తి చూపే వారిని బూతులు తిట్టడం మీద ఉన్న శ్రద్ద నేటి పాలకులకు సమస్యల పరిష్కారం మీద లేదని అన్నారు. ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, పీసీ పల్లి ప్రాంతానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుల సమస్య జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఫ్లోరోసిస్ కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పీసీపల్లి ప్రాంతంలో తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం లేదని బాధితులు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో రూ. 150 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచే నాయకులకు ప్రజా సమస్యల మీద మాత్రం దృష్టి సారించే సమయం లేదు. ఉద్దానం, నల్గొండ తర్వాత ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం, పీసీ పల్లి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రత ఉంది. చిన్న వయసులోనే కాళ్లు వంకర్లు పోతున్న దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఉద్దానం వెళ్లిన తర్వాతే సమస్య తీవ్రత అర్ధమయ్యింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి రూ. 10 వేలు ఫించన్, మందులు ఉచితంగా అందించాలి. డయాలసిస్ నిమిత్తం ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి పూర్తయిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దించాలి. ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులను పట్టించుకునే నాధుడు లేడు. ఖర్చులకు డబ్బు ఇవ్వడం లేదు. డయాలసిస్ కి వెళ్లే వారికి వాహనాలు పంపడం లేదు. రాత్రిళ్లు డయాలసిస్ తర్వాత అక్కడే వదిలేసి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ఖర్చు పెట్టుకోలేక, మందులు కొనుక్కునేందుకు డబ్బు లేక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్న విషయాలు మా దృష్టికి వచ్చాయి. జనసేన పార్టీ కనిగిరి ప్రాంతంలో కిడ్నీ బాధితులకు ఖచ్చితంగా అండగా నిలబడుతుంది అని అన్నారు.
కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం, ఎ.కొండూరు మండల పరిధిలోని లంబాడ తండాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కేంద్రం అందుబాటులో లేక పడుతున్న ఇబ్బందులను, గత ఆరు నెలలుగా రూ. 10 వేల ఫించన్ నిలిపివేసిన విషయాన్ని, తమ ప్రాంతానికి కేటాయించిన డయాలసిస్ సెంటర్ ను స్థానిక అధికార పార్టీ నాయకులు తరలించుకుపోయిన విషయాన్ని బాధితులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.