కోవిషీల్డ్‌ డోసుల మధ్య గ్యాప్‌ 12-16 వారాలకు పెంచవచ్చు.. ప్రభుత్వ ప్యానల్‌ సూచన

కరోనా వైరస్‌ నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య సమయాన్ని 12 నుండి 16 వారాలకు పెంచవచ్చునని ప్రభుత్వ ప్యానల్‌ గురువారం ప్రతిపాదించింది. కాగా, మరో వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు. ఈ రెండు వ్యాక్సిన్లకు గతంలో మొదటి, రెండవ డోసులకు మధ్య అంతరం సుమారు నాలుగు నుండి ఆరు వారాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం కోవిషీల్డ్‌కు మాత్రమే నేషనల్‌ ఇమ్యునిజేషన్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ (ఎన్‌ఐటిజిఎ) ఈ సిఫార్సు చేసింది. అదేవిధంగా గర్భిణీలకు వ్యాక్సిన్‌ ఎప్పుడు పొందాలో అవకాశాన్ని ఆమెకు వదిలేయాలని, ప్రసవం తర్వాత కూడా వారు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు అర్హులని పేర్కొంది. సార్క్‌-కోవిడ్‌ 2తో అనారోగ్యం బారిన పడి.. కోలుకున్న వారికి ఆరు నెలల పాటు టీకాను వాయిదా వేయాలని ఎన్‌ఐటిజిఎ సూచించింది. ఈ సూచనలు అమలు చేసేందుకు తమ సిఫార్సులను నేషనల్‌ ఎక్స్‌ఫర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించనుంది.