గచ్చిబౌలి స్టేడియం రెండు ముక్కలు కాకుండా చూస్తాం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ శాసనసభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిపై వివరణ ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియాన్ని రెండు ముక్కలు కానివ్వబోమని స్పష్టం చేశారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే తొమ్మిది ఎకరాలు కేటాయించగా, గచ్చిబౌలి స్టేడియంలోని మరో ఐదు ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించగా, క్రీడాకారులు ఇటీవల ఆందోళనకు దిగారు.

నేడు సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ గచ్చిబౌలి స్టేడియానికి ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. టిమ్స్ ఆసుపత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని వివరించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి త్వరలోనే గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శిస్తారని తెలిపారు.