తిరుమలలో స్వర్ణరథోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వర్ణరథోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు మహిళలు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి. విశేషమైన ఈరోజు స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ పులకించిపోయారు.