‘గూగుల్’ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతి శుక్రవారం కూడా వీకాఫ్

ఉద్యోగుల విషయంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కరోనా వేళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న తమ ఉద్యోగులకు ప్రతి శుక్రవారం కూడా వీకాఫ్ అని ప్రకటించింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఈ అవకాశం కల్పించినట్లు సీఎన్‌బీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అదనపు వీకాఫ్… ఫుల్ టైమ్ ఉద్యోగులతోపాటూ… పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని చెప్పింది. అంటే ఉద్యోగులు శుక్రవారం పని చేయకపోయినా… ఆ రోజు గూగుల్ శాలరీ ఇస్తుందన్నమాట. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలలోని పెద్ద కంపెనీలన్నింటినీ ఆశ్చర్యంలో పడేసింది. కరోనా వచ్చి ఏడు నెలలు దాటిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ.. దీని వల్ల సంస్థకు, ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుందని ప్రకటించింది గూగుల్.

ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో శుక్రవారం పనిచేయాల్సి వస్తే.. వారు మరొక రోజును సెలవుగా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. డే ఆఫ్‌ను కల్పించేందుకు మేనేజర్లు, వారి బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలని గూగుల్ సూచించింది. వచ్చే ఏడాది మధ్య వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపే మొగ్గు చూపుతున్న తరుణంలోనే.. ఈ ఫోర్‌ డే వీక్‌ని కంపెనీ ప్రకటించింది. కాగా కరోనా నేపథ్యంలో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని ఇచ్చాయి. ఈ క్రమంలో పనిభారం పెరుగుతుందని, విశ్రాంతి దొరకడం లేదని గూగుల్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం.