ఈ-సేవ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కోల్పోయిన ఈ-సేవ ఉద్యోగుల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గళమెత్తారు. ఈ-సేవ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ‘ఆప్కాస్‌’ పరిధిలోకి తీసుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 17 ఏళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు ఒక్కసారిగా రోడ్డునపడడం బాధాకరమని అన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో వారికి ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్‌ ఈ-సేవ కేంద్రాల్లో 607 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, వారంతా జీతాలు అందక కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు వందలాది సేవలందిస్తున్న ఈ-సేవ కేంద్రాలను, వాటిలోని ఉద్యోగుల పరిస్థితిని గందరగోళానికి గురిచేయడం తగదన్నారు. ఈ కేంద్రాలకు సంబంధించి విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) పరిధిలోకి తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.