ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలు

• సామాన్యుల స్థలాలు వశం చేసుకొని భవనాలు కట్టే అధికారం ఎక్కడిది?
• అధికార పక్షం చెప్పిందని చేస్తే మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పడతారు

ఖాళీ స్థలాలకు పన్ను వసూలు పేరుతో నగరాలు, పట్టణాల్లో మున్సిపాలిటీ అధికారులు చేస్తున్న బెదిరింపులు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో బోర్డులు పెట్టి స్థలం స్వాధీనం చేసుకొంటామని హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నాం. ప్రజల యోగక్షేమాలు చూస్తూ, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణం. అధినాయకుడి ఆలోచనకు అనుగుణంగానే అధికారులు నడుచుకొంటున్నారేమో? ఇంటి పన్ను కట్టకపోతే ఇళ్ళల్లో సామాన్లు జప్తు చేసి చెత్త వాహనాల్లో తరలించారు. ఇప్పుడు తమకు ఓ ఆస్తిగా ఉంటుందని సామాన్యులు కొనుక్కొన్న చిన్నపాటి జాగాలను కూడా స్వాధీనం చేసుకోవడం వెనక కుట్ర ఉంది. ఈ రీతిన మున్సిపాలిటీ కబ్జా చేసిన స్థలాలను తాకట్టుపెట్టే ఆలోచన ఉందా? ఎవరైనా వైసీపీ పెద్దలకు కారు చౌకగా కట్టబెట్టాలని చూస్తున్నారా? ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివసిస్తున్న ప్యాలెస్ కి పన్ను కట్టలేదనే విషయం పత్రికలు బయటపెట్టే వరకూ అధికారులు కిమ్మనలేదు. సామాన్య ప్రజలంటే అధికారులకు అలుసా? అధికార పక్షం చెప్పిందని.. ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు స్వాధీనం చేసుకొంటాము, భవనాలు కట్టుకొంటాము అంటే అధికారులు ఇబ్బందుల పాలవుతారు. ఈ విధంగా ప్రజలను బెదిరించే అధికారం వారికి ఏ చట్టం ఇచ్చింది. స్థానిక సంస్థల అధికారులు ముందుగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపైనా, ప్రభుత్వం పక్కదారి పట్టించిన నిధులను తిరిగి తెచ్చుకోవడం మీదా దృష్టి సారించాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.