బోయిన్‌పల్లి మార్కెట్‌ను సందర్శించిన గవర్నర్‌

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మంగళవారం ఉదయం సందర్శించారు. గవర్నర్‌కు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి స్వాగతం పలికారు. కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌ పనితీరును ఆమె పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో గవర్నర్‌ కలియదిరిగారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఐఐసీటి శాస్ర్తవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ‘బోయిన్‌పల్లి మార్కెట్‌ రాష్ట్రానికే గర్వకారణం. ఇళ్లు, కార్యాలయాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఐఐసీటీ శాస్ర్తవేత్తలు బృందానికి అభినందనలు. బోయిన్‌పల్లి మార్కెట్‌ను సందర్శించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్‌’లో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్‌, 30 కేజీల బయో ఫ్యూయల్‌ ఉత్పత్తి చేస్తున్నారని బోయిన్‌పల్లి మార్కెట్‌ను ప్రశంసించారు. ఆ విద్యుత్‌ నుంచే బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో విద్యుత్‌ కాంతులు ప్రసరించడంతో పాటు బయోఫ్యూయల్‌ ద్వారా మార్కెట్‌ క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు వండుతున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మనందరికీ ఎంతో ఆదర్శనీయమని ప్రధాని వెల్లడించిన విషయం తెలిసిందే.