తెలంగాణలో సంక్రాంతి తర్వాత కాలేజీల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్‌..

కొత్త సంవత్సరం అయినా స్కూల్స్ తెరుస్తారని అందరూ అనుకుంటున్నా.. ఇంకా ప్రభుత్వం తరపున ప్రకటన విడుదల కాలేదు. అయితే జూనియర్ కాలేజీల విషయంలో మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది. సంక్రాంతి పండగ తర్వాత ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్ మెంట్‌ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆమె.. జూనియర్ కాలేజీలను తెరిచే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగాలని అందరం ఆశిద్దామని అన్నారు. సంక్రాంతి తర్వాత కాలేజీలు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, కేసీఆర్ నిర్ణయం తర్వాత దీనిపై ప్రకటన చేస్తామని చెప్పారు.

సంక్రాతి తర్వాత కాలేజీలు తెరుచుకునే మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సన్నద్ధమవుతుంది. వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చకచక జరుగుతుండటంతో విద్యాశాఖలో ధైర్యం నిండుకుందని చెప్పాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఇక కాలేజీలకు నిర్భయంగా పంపించేందుకు ముందుకు వస్తారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కరోనా వల్ల మూతపడ్డవి ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి అనేక సంస్థలు పని చేస్తున్నాయి. అయితే పిల్లల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ చేయలేదు. కాగా కొత్త ఏడాదిలో ఇవి కూడా తెరచుకోనున్నాయి.

అయితే విద్యాసంస్థల రీఓపెనింగ్‌పై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఎగ్జామ్స్నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి, స్టూడెంట్స్ను ఎగ్జామ్స్కు రెడీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి.