‘హైతాబాద్‌’ పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకుంటుంది

హైతాబాద్‌ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 26 కి.మీ దూరంలో ఉన్నఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతానికి బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతోంది. కొత్త కంపెనీలు కూడా ఏర్పాటవుతుండడంతో ఇక్కడ వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి. మరోవైపు ఈ ప్రాం తం చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల పరిధిలోని హైతాబాద్‌, చందన్‌వెళ్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 1128 ఎకరాల సర్కారు భూమిని రైతుల నుంచి తీసుకుని ప్రభుత్వం వివిధ కంపెనీలకు ఇచ్చింది. దీంతోపాటు 700 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ కొనుగోలు చేసి వెల్‌స్పన్‌, అమెజాన్‌, కటెరా, కుందన్‌ టెక్స్‌టైల్స్‌ కంపెనీలకు విక్రయించింది. ఆయా కంపెనీలు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న వెల్‌స్పన్‌ కంపెనీ యువతకు విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

ఈనెల 25న వెల్‌స్పన్‌ కంపెనీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. మంత్రులు సబితా రెడ్డి, మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొంటారని చెప్పారు. కాగా, మరో మూడు కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కూడా పూర్తయితే మరో  2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయా కంపెనీల నిర్వహకులు చెబుతున్నారు. దీంతో పాటు పరోక్షంగా కూడా చాలా మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.