అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకున్నారా?

కోవిడ్‌ వైరస్‌ కారణంగా ఆదాయ వనరులు తగ్గి పోయిన కారణంగా పాఠశాలల విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే సర్కార్‌ ఉత్తర్వులను పట్టించుకోకుండా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రయివేటు పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్నింటికి నోటీసులిచ్చారు? వచ్చిన జవాబులేంటి? తదితరాలపై సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ విద్య పేరుతో విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడంపై దాఖలైన వేర్వేరు పిల్స్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. ఓల్డ్‌ ఓయినపల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ పాఠశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయనీ, అన్ని రకాల ఫీజుల్ని ట్యూషన్‌ ఫీజుగా వసూలు చేసినట్టు ఫిర్యాదులొచ్చాయనీ ప్రభుత్వం చెప్పింది. హైకోర్టు గతంలో నిర్ణయించిన మేరకు ఫీజులను చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ మేరకు డీడీలు చెల్లించాలని హైకోర్టు ఆదేశిస్తూ కోర్టు ధిక్కార కేసును క్లోజ్‌ చేసింది. జీవో అమలు నిమిత్తం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశామనీ, జిల్లాల్లోనూ జీవో అమలుకు చర్యలు తీసుకుంటున్నామనీ ప్రభుత్వం చెప్పింది. ఆ చర్యలపై నివేదిక నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కి వాయిదా వేసింది.