తమిళనాడు, పుదుచ్చేరిల్లో కురుస్తున్న భారీ వర్షాలు ..

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తమిళనాడులో ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది.  కన్యాకుమారి తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పుదుచ్చేరిలో కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు తలెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వర్షంతో ఎక్కడికక్కడ భారీగా నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వదర నీరు భారీగా చేరి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగాయి. కాగా, మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.