వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు..

యూపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 31వ తేదీ వరకు సెలవులను రద్దు చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. వీరితో పాటు డాక్టర్లు, నర్సులు, కాంట్రాక్టు ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేసింది.

వచ్చే ఏడాది మొదటి నెలలో కోవిడ్ టీకా అందుబాటులోకి రానుండటంతో యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కరోనా బాధితులందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు జనవరి 31వ తేదీ వరకు సెలవులను రద్దు చేశారు.

తొలిదశలో భాగంగా గోరఖ్‌పూర్‌లోని 23 వేల మంది కరోనా బాధితులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి అనే అంశంపై డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది.