రైతులకు సంఘీభావం ప్రకటించిన హాలీవుడ్‌ నటి

హాలీవుడ్‌ సీనియర్‌ నటి సుసన్‌ సరందన్‌ రైతు నిరసనలకు మద్దతుగా గళం విప్పారు. భారత్‌లో రైతుల ఆందోళనలకు సంఘీభావంగా నిలుస్తానని ఆమె చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. పాప్‌ గాయని రిహన్న రైతు నిరసనలకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో హాలీవుడ్‌ సీనియర్‌ నటి సుసన్‌ తాజాగా రైతన్నలకు బాసటగా నిలుస్తూ ముందుకు రావడం గమనార్హం.

స్వీడన్‌ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌, మీనా హ్యారిస్‌, నటి అమంద సెర్ని, గాయకులు జేసిన్‌, జేస్‌, మియా ఖలీఫా సహా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో మేథావులు ఆందోళన బాటపట్టిన రైతుల పక్షాన నిలిచారు. మరోవైపు రైతుల ఆందోళనలపై సెలబ్రిటీల సోషల్‌ మీడియా పోస్టులను ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చాలా కొద్దిమంది రైతులు మాత్రమే నిరసనలకు దిగారని పేర్కొంటోంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సాగే దురుద్దేశపూరిత ప్రచారం ఎన్నటికీ విజయవంతం కాదని, సమస్యలను భారత్‌ స్వయంగా పరిష్కరించి ముందుకు పోగలదని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పష్టం చేశారు.