పరువు పోయినా పదవే ముఖ్యం!

* నైతికత లేని వైసీపీ మంత్రులు
* తీవ్ర ఆరోపణలు వచ్చినా పదవుల్లోనే..
* సీఎం అడగరు.. మంత్రులు కుర్చీ దిగరు

వరుసగా జరిగిన రెండు రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ ఏకంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు అప్పటి రైల్వే మంత్రి శ్రీ లాల్ బహుదూర్ శాస్ర్తి. ప్రధాని నెహ్రూ వద్దు అని వారిస్తున్నా వినకుండా… ఆయన పదవిని త్యజించారు. అవీ అప్పటి రాజకీయాలు. నేటి రాజకీయాల్లో అలాంటి నైతికతలు… బాధ్యతలు కనిపించవు. ఎంత తీవ్రమైన నేరం చేస్తే అంత గొప్ప.. ఎంతటి తీవ్రమైన నేరారోపణలు వస్తే అదే పెద్ద కిరీటం అన్న చందాన తయారైంది. రాష్ట్రంలో అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సాక్షాధారాలతో సహా పాలకుల దుర్నీతి బయట పడుతున్నా.. వారికి కనీసం చీమ కుట్టినట్టు అయినా లేదు.
* వైకాపా ప్రభుత్వంలో తరచూ మంత్రుల మీద నేరారోపణలు… కేసులు వస్తున్నా పదవిలో ఉంటూనే వాటిని ఎదుర్కొంటున్నారు తప్పితే… పదవిని విడిచిపెట్టే ఆలోచన ఉండటం లేదు. పదవిలో ఉంటూనే వారిపై వచ్చి పడుతున్న కేసులను కాచుకునే క్రమంలో సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు దిగుతున్నారు తప్పితే… సచ్ఛీలతతో నిర్దోషిత్వం నిరూపించుకునే ప్రయత్నాలే లేవు. వైకాపా ప్రభుత్వ అధినాయకుడి మీదనే సుమారు 38 కేసులుండగా… మా మీద ఉన్న చిన్నాచితకా కేసులు ఓ లెక్కా అంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అద్దం పడుతుంది. అంతేలే… ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్న సామెత నేటి ఆంధ్ర రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది.
* వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మీద ఫోర్జరీ కేసులో తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. 2016లో వైకాపా ఎమ్మేల్యేగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద తీవ్రమైన నేరారోపణలు చేశారు. విదేశాల్లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నట్లు కొన్ని పత్రాలను బయటపెట్టారు. అయితే వీటిని తీవ్రంగా తీసుకున్న సోమిరెడ్డి అవి ఫోర్జరీ పత్రాలని కాకాని మీద కేసు పెట్టారు. ఈ కేసు నెల్లూరులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నడుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన ఆ కోర్టులో రాత్రి వేళ దొంగతనం జరిగింది. కాకాణి కేసు తాలుకా పత్రాలను దొంగలు దొంగిలించారు. దీనిపై కోర్టు క్లర్కు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ ఘటనలో తీవ్రమైన నేరారోపణలు కాకాణి మీద రావడంతో సుమోటోగా కేసు తీసుకున్న హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మొత్తం వేళ్లన్నీ కాకాణి వైపే చూపిస్తున్నా… ఆయన మాత్రం తనకేం తెలియదన్నట్లుగా పదవిలోనే ఉన్నారు. రకరకాల కథలు రోజూ చెబుతున్నారు.
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖలో 70 ఎకరాల భూమికి అడ్డదారిలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇప్పించి సన్నిహితులకు, కుటుంబసభ్యులకు దాన్ని కట్టబెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. దీన్ని సిట్ సైతం పూర్తి విచారణ చేసి, ఆయన తప్పులను ఎత్తి చూపింది. ఆయన చేసిన నిర్వాకాన్ని ఐఏఎస్ అధికారులు నిగ్గు తేల్చినా… ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. రూ.వందల కోట్ల విలువైన భూమిని మింగేశారు అని తెలిసినా ధర్మాన ప్రసాదరావును ఏమీ చేయలేకపోతున్నారు. భూములను రక్షించాల్సిన రెవెన్యూ మంత్రి వాటిని భక్షించారని తేలినా.. ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేయకపోగా.. సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తూ వంత పాడుతోంది.
* మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. ఉద్యోగాన్ని వదిలిపెట్టిన సురేష్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. ఇందులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా ఆదిమూలపు సురేష్ ను పేర్కొన్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ను సురేష్ దంపతులు తప్పుబట్టారు. సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మంత్రి దంపతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంటూ సీబీఐ ఆ ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తేలింది. కేసు నమోదు అయినా… తర్వాత ఆదిమూలపు సురేష్ ను ముఖ్యమంత్రి విద్యాశాఖ నుంచి మున్సిపల్ శాఖకు మార్చి చిన్న పదోన్నతి ఇచ్చారు.
* పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ప్రాంతంలో కొన్ని వివాదాస్పద భూములకు ఎన్ వోసీలు ఇప్పించుకొని, వాటిని పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని మీడియాలో సాక్షాధారాలతో వార్తలు వచ్చాయి. కోట్ల రూపాయల విలువైన సంపద కొల్లగొడుతున్నారని ఆధారాలతో సహా బయటకు వచ్చినా, దాని మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.
* కర్నూలు జిల్లా, అస్సరిలో 30.83 ఎకరాల భూ వివాదం విషయంలో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీ నోటీసులు ఇచ్చింది. రూ.52 లక్షలకు లెక్కలు లేవని ఐటీ పేర్కొంది. మొత్తం 180 ఎకరాల భూమి కొనుగోళ్లలో 30.82 ఎకరాలపై వివాదం నెలకొంది. దీనిపై పూర్తిస్థాయిలో ఆదాయపుపన్ను శాఖ దృష్టి సారించి.. ఏకంగా మంత్రి భార్య, బంధువులకు నోటీసులు జారీ చేసినా మంత్రి కనీసం నైతిక బాధ్యత వహించలేదు.
* జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన సొంత నియోజకవర్గంలో కొండలరావు అనే యువకుడు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.5 లక్షల సాయంలో సగం అంటే రూ.2.50 లక్షలు తనకు ఇవ్వాలని పేదలను ఆదేశించిన ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. కచ్చితంగా అంత మొత్తం ఇస్తేనే మిగిలిన సొమ్ము అందుతుందని బాధితులకు మంత్రి చెప్పడం, బాధితులు బాహాటంగా ఆ విషయాన్ని మీడియాతో చెప్పినా మంత్రి అంబటి రాంబాబు దాన్ని సమర్ధించుకుంటున్నారు తప్పితే… దీనికి బాధ్యత వహించి ఆయన చెప్పినట్లే మంత్రి పదవి త్యజించి.. దీనిలో నిజానిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేయడం లేదు.
* ముఖ్యమంత్రి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. ఒకానొక సమయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సీబీఐ అధికారుల మీదనే కేసులు పెట్టి, అధికారులను బెదిరించే స్థాయికి పరిస్థితి వెళ్లినా.. అక్కడి ఎంపీ నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి కూడా మిన్నకుండిపోవడం మరో విశేషం.