‘అగ్రి’ వేదన.. అన్న వంచన

* అధికారంలోకి వస్తే వారంలోనే సాయం చేస్తానని చెప్పిన శ్రీ జగన్ రెడ్డి
* అనేక సార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి
* అగ్రిగోల్డ్ బాధితుల ఎదురుచూపులు
* న్యాయపోరాటం కూడా చేయని సర్కారు

అన్న చెప్పాడంటే చేస్తాడంతే అనేది వైసీపీ కార్యకర్తల స్లోగన్… వాస్తవంగా చూస్తే మాత్రం అన్న చెప్పాడంటే మర్చిపోతాడంతే… అన్నట్లుంది పరిస్థితి. అగ్రిగోల్డ్ బాధితులకు అధికారంలోకి వచ్చిన వారంలోనే న్యాయం చేస్తానని మాటిచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా మర్చిపోయారు. బాధితులకు రావాల్సిన డబ్బులు ఇచ్చేందుకు ఏ మాత్రం దారులు వెతకడం లేదు. న్యాయపరంగా వెళితే బాధితులకు సాంత్వన చేకూరే అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. గతంలో కొందరికి మాత్రమే డబ్బులు అందాయి తప్పితే.. దీనిలో పూర్తిస్థాయి న్యాయం మాత్రం జరగలేదు. ప్రభుత్వం సైతం బాధితులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లడం లేదు. వారం రోజుల్లోనే న్యాయం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి మళ్లీ అగ్రిగోల్డ్ ఊసే ఎత్తడం లేదు.
* విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన అగ్రిగోల్డ్ సంస్థ దేశంలోని 8 రాష్ట్రాల్లో మొత్తం 32 లక్షల మంది డిపాజిటర్ల దగ్గర నుంచి సుమారు రూ.6 వేల కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ లోనే ఏకంగా 19 లక్షల మంది నుంచి రూ.3,965 కోట్లు సేకరించింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా డిపాజిట్లు సేకరించి, సకాలంలో తిరిగి చెలించకపోవడంతో గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. 2014లో నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
* గతంలోనే ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఛైర్మన్ తో సహా డైరక్టర్లను అరెస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీకి సంబంధించిన రూ.2,585 కోట్ల ఆస్తులతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని రూ.3,785 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసిన తర్వాత 142 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే… పూర్తిగా కేసును పక్కన పెట్టేశారు.
* అప్పట్లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలోగా బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న బాధితులకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించిన వైసీపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్ కేటాయింపు చేసింది. దీంతో సుమారు 15 లక్షల మంది డిపాజిటర్ల సమస్య తీరుతుందని అంతా భావించారు.
* కేటాయింపులు అయితే చేశారు కానీ.. తర్వాత ఆ డబ్బులు విడుదల కాలేదు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము చెల్లింపుపై ప్రభుత్వం మెలిక పెట్టింది. మొదట రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికే చెల్లింపులు చేస్తామని చెప్పింది. 2019 నవంబరులో తొలివిడతగా 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ దీనిపైనా ప్రభుత్వం మడమ తిప్పింది. కేవలం ఒక్క బాండు ఉన్న వారికే చెల్లిస్తామని చెప్పి, చివరకు 3.40 లక్షల మందికి రూ.238 కోట్లు మాత్రమే చెల్లించింది.
* దీంతో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. అప్పుడు ప్రభుత్వం రూ.20 వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తామని చెప్పింది. మొత్తం 7 లక్షల బాండ్లకు రూ.667 కోట్లు విడుదల చేసింది. అప్పట్లోనే మిగిలిన వారికి త్వరలోనే న్యాయం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి… మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. కనీసం వారి సమస్యను న్యాయపరంగానూ పరిష్కరించే దారి చూడటం లేదు.
* అగ్రిగోల్డ్ డిపాజిటర్ల లెక్కలు గతంలోనే బయటకు వచ్చాయి. 5 వేల లోపు డిపాజిట్ చేసిన వారు 7.35 లక్షలు ఉంటే వారికి రూ.212.23 కోట్లు చెల్లించాలి. రూ.10 వేలు డిపాజిట్ చేసిన వారి సంఖ్య 12.86 లక్షలు మంది అయితే వారికి రూ.720.49 కోట్లు చెల్లించాలి. రూ.20 వేలు డిపాజిట్ చేసిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటే రూ.1,429 కోట్లు అవసరం అవుతాయి. రూ.50 వేలు వరకు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు చెల్లించాలంటే రూ.1,851.81 కోట్లు అవసరం అవుతాయని లెక్కలు వేశారు.
* అయితే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.905 కోట్లు మాత్రమే విడతల వారీగా చెల్లించింది. బాధితులందరికీ న్యాయం చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది తప్పితే… వాటిని పరిష్కరించే మార్గం చూడటం లేదు. ఫలితంగా బాధితులు మళ్లీ తాజాగా ఉద్యమానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాధితుల్లోనూ కొందరికి మాత్రమే న్యాయం చేయడంపైనా వారంతా ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. ఆస్తులను జప్తు చేసిన ప్రభుత్వం వాటిని అమ్మి అయినా బాధితులందరికీ సాయం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.