పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాములో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో రసయనాలు భారీగా నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. గోదాము నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటల భారీగా చెలరేగడంతో గోదాంలోకి వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు జెసిబిల సాయంతో గోదాము గోడలను కూల్చి వేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.