బస్సు సర్వీసుల పునరుద్ధరణపై వీడని చిక్కుముడి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై మరోసారి రెండు రాష్ర్టాల ఆర్టీసీ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.. మరోసారి తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు విఫలం అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు చర్చించినా.. మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై ఏపీఎస్‌ ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రూట్లవారీగా రెండు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించింది. రూట్లవారీగా కొన్ని ప్రతిపాదనలను ఏపీ అధికారులకు ఇచ్చింది. వాటిపై అధ్యయనం చేశాక ఎగ్జిక్యూటివ్‌ అధికారుల స్థాయిలో రెండ్రోజుల్లో మరోసారి భేటీ కావాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడున్న దానికంటే 50 శాతం మేర కిలోమీటర్లు పెంచుకుంటే.. తాము 52 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఒప్పందం జరిగేవరకు 70 వేల కిలోమీటర్ల మేర రెండు రాష్ర్టాలు నడుపుదామని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. ఒప్పం దం పూర్తయితేనే బాగుంటుందని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. రెండు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.