190 లక్ష్యం తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది. శిఖర్‌ ధావన్‌ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) అర్ధశతకంతో అదరగొట్టిన వేళ హైదరాబాద్‌కు దిల్లీ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టాయినిస్ (38; 27 బంతుల్లో, 5×4, 1×6), ధావన్‌ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్‌ను పొందిన స్టాయినిస్ తర్వాత చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అతడికి తోడుగా ధావన్‌ కూడా మెరవడంతో పవర్‌ప్లేలో దిల్లీ 65 పరుగులు సాధించింది. స్టాయినిస్‌ను రషీద్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 86 పరుగుల వద్ద దిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (21; 20 బంతుల్లో, 1×4)తో కలిసి ధావన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. దూకుడుగా ఆడే క్రమంలో శ్రేయస్‌ ఔటైనప్పటికీ దిల్లీకి స్కోరువేగం తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన హెట్‌మైయర్‌ (42*; 22, 4×4, 1×6) పరుగులు రాబట్టాడు. అయితే ఆఖరి రెండు ఓవర్లలో హైదరాబాద్ కట్టుదిట్టంగా బంతులు వేసి 13 పరుగులే ఇచ్చింది. 19వ ఓవర్‌లో ధావన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్, రషీద్‌, హోల్డర్‌ తలో వికెట్ తీశారు.