ఐపీఎల్ వాయిదా నష్టం రూ. 2,200 కోట్లు

ఐపీఎల్  2021 వాయిదా పడడంతో బీసీసీఐకి దాదాపు రూ. 2,200 కోట్ల మేర నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు బోర్డుకు ముట్టేవి. నిజానికి వీరందరూ మ్యాచ్‌ల లెక్కన బోర్డుకు చెల్లింపులు జరుపుతారు.

దీంతో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో అప్పటి వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. దీంతో మిగిలిపోయిన మ్యాచ్‌లకు సంబంధించిన సొమ్ము బోర్డుకు అందే పరిస్థితి లేదు. ఇంకా దాదాపు సగం మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో బీసీసీఐకి రావాల్సిన ఆదాయంలో 50 శాతం కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరిస్థితులు అనుకూలించి మ్యాచ్‌లు మళ్లీ జరిగితే కనుక ఈ నష్టాల నుంచి బీసీసీఐ బయటపడే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో కూడా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకే చెల్లించే అవకాశం ఉండగా, ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు సగం డబ్బులు మాత్రమే చెల్లించే అవకాశం ఉందని సమాచారం. అయితే, తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు ఎవరూ స్పందించడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో లీగ్ వాయిదాను సమర్థిస్తున్నట్టు వీరంతా చెప్పుకొచ్చారు.