‘కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనే’

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు.

పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాకుండా నేరుగా తనతో మాట్లాడాలని, అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేతల మధ్య, ఐక్యత, క్రమశిక్షణ అవసరమని చెప్పారు. పార్టీ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, కరోనా వల్లే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైందని సోనియా అన్నారు.

పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన సోనియా.. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు.