నా శాఖను కేసీఆర్ బదిలీ చేశారని తెలిసింది.. చాలా సంతోషం: ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కిందకు తెచ్చుకున్నారు. కేసీఆర్ సిఫార్సుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో .. ఈటల శాఖ లేని మంత్రిగా మిగిలిపోయారు. ఇది జరిగిన వెంటనే ఈటల మీడియా ముందుకు వచ్చారు. తన శాఖ నుంచి తనను సీఎం తొలగించారని తెలిసిందని… చాలా సంతోషం అని చెప్పారు. అన్ని శాఖలపై ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయని.. అందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతానని అన్నారు.

ఒక పక్కా ప్రణాళికతో ఇదంతా జరుగుతోందని ఈటల వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ తోనే భూకబ్జా ఆరోపణలు చేశారని అన్నారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే… తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారనని ఈటల తెలిపారు. అందుకే ఏం జరుగుతోందో తనకు తెలియలేదని అన్నారు. 25 ఏళ్ల జీవితంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పారు. మనసులో ఏదో పెట్టుకుని, కుట్ర పూరిత కథనాలతో, ఎదుటి వారి క్యారెక్టర్ ను నాశనం చేయాలనుకోవడం దారుణమని అన్నారు.

తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే సంగతి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 25 ఏళ్ల చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచానని అన్నారు. ఎవరిపైనా తను వ్యక్తిగత విమర్శలు చేయబోనని అన్నారు. కేసీఆర్ ను కాంటాక్ట్ చేస్తారా? అనే మీడియా ప్రశ్నకు బదులుగా… ఎవరినీ కాంటాక్ట్ చేయబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ తో పాటు ఎవరినీ కలవబోనని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిమానులు, అనుచరులతో కూడా చర్చిస్తానని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.