స్వర్ణం కోసం తీవ్రంగా ప్రయత్నించాను: మీరాబాయి చాను

మణిపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఆణిముత్యం మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ కొట్టడం తెలిసిందే. 49 కేజీల స్నాచ్ అండ్ క్లీన్ జెర్క్ విభాగంలో చాను రజతం గెలవడంతో దేశవ్యాప్తంగా సంతోషం వెల్లివిరుస్తోంది. తన ప్రదర్శన పట్ల చాను ట్విట్టర్ లో స్పందించింది. తన కల నిజమైనట్టుగా ఉందని పేర్కొంది. ఈ రజత పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నానని తెలిపింది. ఈ పోటీల్లో స్వర్ణం సాధించేందుకు చివరి వరకు ప్రయత్నించానని, కానీ రజత పతకం కూడా విలువైనదేనని చాను చెప్పింది. 

ఐదేళ్ల తన కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. తాను కేవలం మణిపూర్ అమ్మాయిని కాదని, యావత్ భారతావనికి చెందుతానని మీరాబాయి చాను పేర్కొంది. తన ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించింది. ముఖ్యంగా తన తల్లికి రుణపడి ఉంటానని, ఆమె తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడింది.