సగం దేశం ఆకలితో ఉంటే.. వెయ్యి కోట్ల ఖర్చుతో పార్లమెంట్ అవసరం ఏంటి?

మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్‌  తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం తన ప్రచారాన్ని ధాటిగా మొదలుపెట్టారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. సగం దేశం ఆకలితో ఉంటే.. మీకు కొత్త పార్లమెంట్ భవనం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. సగం ఇండియా ఆకలితో ఉన్న సమయంలో రూ.1000 కోట్లు పెట్టి పార్లమెంట్ కట్టాల్సిన అవసరం ఏంటి? ఎంతో మంది కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కడుతున్న సమయంలో వేల మంది చనిపోతే.. ప్రజలను రక్షించడానికే దీనిని నిర్మిస్తున్నామని అక్కడి పాలకులు చెప్పారు. మరి ఎవరిని రక్షించడానికి ఈ వెయ్యి కోట్ల పార్లమెంట్‌? దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి మిస్టర్ పీఎం అంటూ కమల్ చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. భారీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ నెల 10న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికల్లో తాను కూడా బరిలోకి దిగాలని భావిస్తున్న కమల్ హాసన్‌.. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.