మత్స్యకారులపై ప్రేమ ఉంటే జగన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేయాలి

  • ప్రజల ఆవేదన, ప్రభుత్వ వైఫల్యం తెలుస్తాయి
  • అర్హులైన మత్స్యకారులకీ లబ్ధి అందటం లేదు
  • జనసేన మత్స్యకార వికాస విభాగం తరఫున ప్రత్యేక ఫోన్ నెంబర్
  • చెత్త పన్ను కట్టలేదని చెత్త ఇళ్ల ముందు వేస్తున్నారు
  • కాకినాడలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

మత్స్యకార ప్రాంతాలను ప్రభుత్వం డంపింగ్ యార్డులుగా మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టలేదని ఇళ్ళ ముందే చెత్తపడేసి వెళ్లడం సమంజసం కాదని అన్నారు. తీర ప్రాంతంలో ఉన్న 560 మత్స్యకార గ్రామాల్లో తాగునీటి సమస్య, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మత్స్యకారులపై ప్రేమ ఉంటే వారి సమస్యల పరిష్కారానికి ఇప్పుడు పాదయాత్ర చేయాలని ఛాలెంజ్ చేశారు. అర్హులైన చాలామంది మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకోవడానికి పార్టీ తరపున మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని, దానికి సమాచారం అందించాలని కోరారు. కాకినాడ ముత్తా క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసమే ఈ యాత్ర చేపట్టాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం సూర్యారావు పేటలో మొదలైన పాదయాత్ర పరదేశమ్మపేట వరకు సాగింది. ఏడు మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించి అనేక సమస్యలు తెలుసుకున్నాం.

*హామీలకు భిన్నంగా పాలన

పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చారు. కాలుష్యం వెదజల్లే దివీస్ కంపెనీని బంగాళాఖాతంలో కలిపేస్తాం అని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ఏమైంది?. ఆయన ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా పాలన సాగుతోంది. ప్రభుత్వం శాసనసభలో చేసిన ప్రకటనలకు కూడా విలువ లేకుండా పోయింది. మత్స్యకారులకు అందించాల్సిన ఆర్థిక సాయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేట విరామం ఉన్న సమయంలో ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ. 10వేలు ఇస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో వేటకు వెళ్ళేవారు దాదాపు 2.5 లక్షల మంది ఉంటే ప్రభుత్వం కేవలం 1.39 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. 1 లక్ష 6 వేల మందికే ఆ భృతి ఇచ్చారు. చాలా మంది అర్హులకు సాయం అందలేదు. డీజిల్ సబ్సిడీ కూడా చిత్తశుద్ధితో ఇవ్వడంలేదు. అర్హులైనా ఏ కారణంతో సాయం అందలేదో, లిస్టులో ప్రకటించి కూడా ఇవ్వలేదు. ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వారు జనసేన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చు.

ప్రేమ ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నాయి

సముద్రంలో వేటకు వెళ్ళి దురదృష్టవశాత్తు మృతి చెందితే.. ఆ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. నిజంగా మత్స్యకారులపై ప్రేమ ఉంటే ప్రతి ఏడాది ఆ శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఎందుకు కుదిస్తున్నారో చెప్పాలి. ఒక వైపు డీజిల్ ధరలు పెరుగుతుంటే… ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరడగం లేదు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్ పై రూ.9 సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అందరికీ దక్కడం లేదు. వేటకు వెళ్లినప్పుడు 3వేల లీటర్ల డీజిల్ అవసరమైతే కేవలం 300 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అది కూడా ఇవ్వడం లేదు. దీంతో ఖర్చులు భరించలేని స్థితిలో చాలా మంది మత్స్యకారులు వేట మానేస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏటా 25 వేల మంది మత్స్యకారులు పక్కరాష్ట్రాలకు వలస పోతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నైపుణ్యం లేదని చెప్పి గంగపుత్రులకు అన్యాయం చేసింది

సముద్రం లోపల వేట కొనసాగించేందుకు వీలుగా రూ. 80 లక్షలు విలువైన ఎస్సెల్ బోట్లు సబ్సిడీ కింద ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం తీసుకొచ్చింది. బోటు కొనుక్కోవడానికి 50 శాతం సబ్సిడీ ఇచ్చి, మిగిలిన రూ. 40 లక్షల్లో లబ్ధిదారులు 10 శాతం అంటే రూ. 4 లక్షలు చెల్లిస్తే చాలు బోటు వచ్చేలా పథకాన్ని తీసుకొచ్చి, తీరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపించారు. మత్స్యకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి అద్భుతమైన పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా రాష్ట్రంలో వెస్సెల్ బోట్లుపై వేటకు వెళ్లే నైపుణ్యం గలవారు లేరని సమాచారం అందించింది. గుజరాత్ రాష్ట్రానికి 150 బోట్లు వెళ్లిపోయాయి. మన మత్స్యకారులు నష్టపోయారు.

ఫిష్ స్టాల్స్ పెడతామని చెబుతున్న ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న ఫిష్ మార్కెట్ ప్రాంగణాలను కూల్చింది. నిన్నటి రోజున యాత్ర చేస్తుంటే మత్స్యకార యువకులు ఈ విషయాన్ని చెప్పి ఆవేదన చెందారు. సూర్యారావుపేట ప్రాంతంలో గంగపుత్రుల ఇళ్లని కూల్చేశారు.. కనీసం పరిహారం చెల్లించలేదు.

జీవో నెం. 217ను ఎందుకు ఉపసంహరించుకోలేదు?

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జి.ఓ.217తో సుమారు 4.5 లక్షల మంది మత్స్యకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడింది. చెరువులు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహిస్తే 2500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అవుతాయి. వందల ఎకరాల చెరువులు ఉన్న బడా ఆసాములే వాటి హక్కులు దక్కించుకుంటారు. మత్స్య సంపద మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాలు అన్యాయం అయిపోతాయి. ఈ జీవోపై మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా పక్కన పెట్టారు తప్ప ఈ రోజుకు ఉపసంహరించుకోలేదు. మత్స్యకార సమస్యల అధ్యయనానికి మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేస్తుంటే పాలకులు ఎందుకు భయపడుతున్నారు. యాత్ర మొదలైన ఒక్క రోజుకే అంత ఆందోళన ఎందుకు? ప్రతి పేటలో జనసేన పార్టీ జెండా పట్టుకుంటున్న ప్రతి కార్యకర్తను ఇబ్బందులు పెడుతున్నారు.

గంగవరం పోర్టును ఎందుకు అమ్మేసింది?

ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు, పోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్ లో ఎందుకు కేటాయింపులు తగ్గిస్తోంది. గంగవరం పోర్టును ఎందుకు అమ్మేసింది?. చివరకు డ్వాక్రా సంఘాలు దాచుకునే డబ్బులను కూడా మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ వరకు మత్స్యకార అభ్యున్నతి యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా సేకరించిన డేటాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందిస్తాం. ఆయన 20వ తేదీన నరసాపురంలో జరిగే బహిరంగ సభలో దీనిపై మాట్లాడతారు. సమస్యలపై మాట్లాడమే కాకుండా వాటిపై పార్టీ విధానాలను కూడా వెల్లడిస్తారు. అలాగే మత్స్యకారుల అభ్యున్నతికి పార్టీ తరపున భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నామనే విషయాలు వెల్లడిస్తారని” తెలిపారు.

దామోదరం సంజీవయ్యకు ఘనంగా నివాళి

ఈ కార్యక్రమానికి ముందు ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. విద్యాదాత దివంగత మల్లాడి సత్యలింగం నాయకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, తూ.గో. జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, మత్స్యకార వికాస విభాగం చైర్మన్ నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల రామస్వామి, వరుపుల తమ్మయ్య బాబు, డా.మూగి శ్రీనివాస్, ఆకుల ప్రవీణ్, పాటంశెట్టి సూర్యచంద్ర, మరెడ్డి శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, బండారు శ్రీనివాస్, బి. శివదత్, వేగుళ్ల లీలాకృష్ణ, వాసిరెడ్డి శివ ప్రసాద్, తలాటం సత్య, పి.సరోజ, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.