సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసన వేట

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా సెనెట్ లో అభిశంసన తీర్మానంపై చర్చ లో వేగం పెరిగింది. అధికారాంతంలో అధికారం అప్పగించకుండా అల్లరిమూకలు చెలరేగేలా చేయడంలో ట్రంప్ పాత్ర ఉందని చెప్పడంలో అధికారంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ పట్టుదలతో ఉంది. సెనెట్‌లో కూడా అభిశంసన ట్రయల్ ఆరంభానికి ప్రతినిధుల సభకు చెందిన అధికార పక్ష ప్రముఖులు రంగంలోకి దిగారు. తిరుగుబాటు తరహా వాతావరణం సృష్టించేందుకు యత్నించిన వ్యక్తి తగు మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది.

లేకుంటే భవిష్యత్తులో తప్పుడు సంకేతాలు వెలువరిస్తుందని రిపబ్లికన్లకు తెలియచేయడానికి డెమోక్రాట్లు యత్నిస్తున్నారు. సెనెట్‌లో అధికార పక్ష సభ్యుడు జెమి రస్కిన్ ట్రంప్‌పై ఆరోపణలను ఉధృతం చేశారు. జనవరి 6వ తేదీ నాటి హింసాకాండ అసాధారణం అయినదని, ఏకంగా వైట్‌హౌస్ నుంచే అప్పటికీ అధ్యక్ష హోదాలో ఉన్న నేత అల్లరిమూకలనురెచ్చగొట్టేలా వ్యవహరించారని, ఇందుకు సంబంధించిన సాక్షాధారాలు ఉన్నాయని, దీనిని బట్టి మాజీ అధ్యక్షుడిపై అభిశంసన ట్రయల్ ఫలితాన్ని తేల్చాల్సి ఉందని రస్కిన్ తెలిపారు. చట్టసభలలో సభ్యులు ఓ వైపు దేశాధ్యక్షుడి విజయాన్ని ధృవీకరించే రాజ్యాంగయుత విధులలో ఉన్నప్పుడు అల్లరిమూకలు పార్లమెంట్ వేదిక వద్ద హింసాకాండకు దిగి, లోపలికి చొచ్చుకురావడం జరిగిందని డెమోక్రాట్లు విమర్శించారు.

ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసన తీర్మాన ప్రక్రియ ట్రంప్ అధికారం నుంచి వైదొలగడానికి ఒక్కరోజు ముందునే చేపట్టారు. అయితే సెనెట్ వేదికపై ఈ ప్రక్రియ రావడానికి మూడు వారాలు పట్టింది. సెనెట్ సభ్యులను పార్టీలకు అతీతంగా ఒప్పించి, ట్రంప్‌పై శాశ్వతరీతిలో రాజకీయ వేటు వేసేందుకు ప్రతినిధుల సభ సభ్యులు కూడా సెనెట్ ఆవరణలో లాబీయింగ్ చేపట్టారు. అయితే ట్రంప్ తమ పార్టీలో ఇప్పటికీ కీలక నేతగానే ఉన్నారని, ఆయనను అభిశంసన నుంచి రక్షించుకుని తీరుతామని రిపబ్లికన్లు చెపుతున్నారు.

హింసాకాండ వీడియోల ప్రదర్శన

హింసాకాండను తెలిపే వీడియోలను అధికార పక్ష సభ్యులు ప్రదర్శించారు. అప్పటి ఘటనలో సభలోకి ఇతర వ్యక్తులు దూసుకురావడం, వైస్ ప్రెసిడెంట్ (అప్పటి) మైక్ పెన్స్, ఇయన కుటుంబ సభ్యులు రక్షణ కోసం సెనెట్ ఛాంబర్ నుంచి పరుగులు తీయడం, సభ్యుల మధ్య తోపులాట జరగడం వంటివి చూడవచ్చునని, వీటిని బట్టి మాజీ అధ్యక్షులు ట్రంప్ అమాయక ప్రేక్షకుడు కాదని తేలిందని తెలిపారు. దేశాధ్యక్షుడు అంటే దేశానికి సైనికదళాల ప్రధానాధిపతి, అటువంటి వ్యక్తి తన బాధ్యతను విస్మరించాడు. చివరికి ఆయనే దేశంలో అత్యంత ప్రమాదకరమైన తిరుగుబాటును రెచ్చగొట్టే వ్యక్తి అయ్యాడని, స్పష్టం అయిందని కాంగ్రెస్ సభ్యులు దాడిని ఉధృతం చేశారు.

దేశాన్ని తిరుగుబాట్ల నుంచి రక్షిస్తాననే ప్రమాణం చేసిన నేత అమెరికా చరిత్రలో తొలిసారిగా ఈ విధంగా అసాధారణ విద్రోహిగా మారాడని మండిపడ్డారు. రిపబ్లికన్ సెనెటర్ టెడ్ క్రూజ్ ట్రంప్‌ను సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు ఏదో విధంగా తమ నేతను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కొందరు నేరస్తులు జరిపిన భయానక హింసాత్మక చర్యలకు , ప్రెసిడెంట్ ట్రంప్ మాటలకు లింక్ పెట్టడానికి వారు బ్రహ్మండంగా యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై అభిశంసన నెగ్గితే దేశంలో రెండోసారి అభిశంసనకు గురైన దేశాధినేతగా ట్రంప్ రికార్డుల్లోకి వెళ్లుతారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షుడు అభిశంసనకు గురి కావడం ఇదే తొలిసారి అవుతుంది.