కనుమ ప్రాముఖ్యత..

కనుమను పశువుల పండుగ అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన ఫలసాయాన్ని కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్ష్యాదులకూ భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే పంటల వృద్ధి జరిగిందనడానికి గుర్తుగా కనుమ పండుగను వైభవంగా జరుపుతారు. ఈ రోజు పశువులకు, పక్షులకు ఆహారం అందిస్తారు. గోవులకు పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తారు. తద్వారా ఆరోజు అవి సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలా చేయడం వల్ల వాటికి మనుషులపై ప్రేమ కలిగి అందరికీ శుభాలు చేకూరతాయన్నది ఓ విశ్వాసం. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటారు. కనుమ రోజు కచ్చితంగా తలస్నానమాచరించి సూర్యభగవానుడిని పూజించడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఇంటి బయట రథం ముగ్గు వేసి సూర్య భగవానుడి రథాల గుర్తుగా దాన్ని భావిస్తారు. కనుమ రోజు గారెలు వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయం.