విశ్వాస పరీక్షలో గెలిచిన ఇమ్రాన్ ఖాన్‌

ఇస్లామాబాద్‌: ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో గెలిచారు. ఇమ్రాన్‌కు 178 ఓట్లు పోలయ్యాయి. అవసరమైన దాని కన్నా ఆరు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇటీవల సేనేట్‌లో పాకిస్థాన్ తెహ్రీక్ పార్టీ అనూహ్య ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇవాళ బలపరీక్షకు నిలిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు.

విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఇమ్రాన్‌కు కేవలం 172 ఓట్లు కావాల్సి ఉంది. కానీ ఆయనకు మరో ఆరు ఓట్లు అధికంగానే పోలయ్యాయి. పీటీఐకి చెందిన ఎంపీలు సుమారు 155 మంది మొత్తం ఆయనకే ఓటేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దుతుగానే ఎంక్యూఎం-పీ, బలోచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్‌-క్వయిద్‌, గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్‌కు చెందిన ఎంపీలు ఓటు వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అస్లమ్ బొతానికి కూడా ప్రధానికే ఓటేశారు. తనకు ఓటేసిన పార్టీ ఎంపీలు, మిత్రపక్ష ఎంపీలకు ఇమ్రాన్ థ్యాంక్స్ చెప్పారు.