పార్టీ లీగల్ సెల్ సహకారంతో… పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో బుధవారం పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా జనసేనాని పవన్ మాట్లాడుతూ.. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాల్సిన విభాగాలు, కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అదికార పక్ష వైఖరితో నలిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కొన్నిసమయాల్లో ఎదుటిపక్షాలు మనల్ని అవమానిస్తాయని, ఆ అవమాన భారాన్ని తాను కూడా తట్టుకున్న వాడినేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ, మన లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఆ మాటలు ఆపలేవని తేల్చిచెప్పారు. ఇక అధికార పార్టీకి కొమ్ము కాసేలా పని చేస్తుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం లభిస్తుంది, వారికి రక్షణ ఎలా దొరుకుతుందని పవన్ ప్రశ్నించారు. సగటు ప్రజల కష్టాలను, వారి ఈతిబాధలను, ఆందోళనలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

పాలన వ్యవస్థ నుంచి చట్టబద్ధంగా రక్షణ, ప్రయోజనాలు లభించక, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవాలని ఇందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అవసరమని జనసేనాని పవన్ పిలుపునిచ్చారు. అలాగే పార్టీ కోసం పని చేస్తూ ప్రభుత్వ ఒత్తిళ్లతో అక్రమంగా పెట్టిన కేసుల్లో చిక్కుకున్న వారికి కావాల్సిన న్యాయ సహాయం అందివ్వలన్నారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.