‘అమర రాజా’ కు అనుకూలంగా…

‘అమర రాజా ఇన్‌ఫ్రా’ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలశాఖ గత జూన్‌ 30న జీవో 33ను జారీ చేసింది. అయితే, అక్కడ ఒప్పందంలో పేర్కొన్న దానికి మించి పెట్టుబడులు పెట్టామని, ఎక్కువ మందికే ఉద్యోగాలు కల్పించామని, నిబంధనల మేరకే నడుచుకున్నామని అమర రాజా సంస్థ కోర్టుకు విన్నవించింది.

ఈ విన్నపాన్ని ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఇటీవల ఈ వ్యవహారంపై విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. 2009లో ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించగా, దాని వద్ద అమరరాజా కొనుగోలు చేసిందని, దీనికి సంబంధించిన పక్కా దస్తావేజులు తమ వద్ద ఉన్నాయని వివరించారు. సంస్థ ఎక్కడా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని కేవలం నిరాధార ఆరోపణలతో భూమిని వెనక్కి తీసుకోవాలనుకోవడం సరికాదని వివరించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి జారీ చేసిన జీవో 33ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి ఆ జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం తన వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం చొరవ వల్లనే ఏపీఐఐసీ అమర రాజాకు భూములు ఇచ్చిందని, అలాంటప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినందునే ప్రభుత్వం చర్యలకు దిగిందని వివరించారు. ఇరు పక్షాల వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను వెలువరించారు.