వేస‌విలో ప్ర‌భుత్వం చ‌లివేంద్రాలు ఏర్పాట్లు చేయాలి

  • వ‌డ‌దెబ్బ బాధితుల కోసం ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాలి
  • నీటి ఎద్ద‌డి లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిలకలూరిపేట: పెరుగుతున్న ఎండ‌ల‌కు త‌గ్గ‌ట్లు అధికారులు ముంద‌స్తు తీసుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ఇప్ప‌టికే రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింద‌ని, రానున్న రోజుల్లో మ‌రింత‌గా ఎండ‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌ని వెల్ల‌డించారు. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు అధికారులు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. గ‌తంలో స్వ‌చ్చంధ సంస్థ‌లు, వివిధ రాజ‌కీయ పార్టీలు చ‌లివేంద్రాలు ఏర్పాటు చేసేవ‌ని, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో అటువంటి ప‌రిస్థితి లేద‌న్నారు. అధికారులే ముఖ్య కూడ‌ళ్ల‌లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. వేసవి దృష్ట్యా బాటసారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వమే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంద‌ని గుర్తు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ‌స్టాండ్‌లు, ప్ర‌యాణికులు ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో చ‌లివేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రి,పీహెచ్‌సీల‌లో వ‌డ‌దెబ్బ బాధితుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు కేటాయించి, స‌త్వ‌ర చికిత్స‌కు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందులు అందుబాటులో ఉంచాల‌ని కోరారు. నీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. వేస‌విలో తాగునీటి ఎద్ద‌డికి అధికారులు య‌ద్ద ప్రాతిప‌దిక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఎండిపోతున్నాయని, ప్ర‌జ‌లు క‌లుషిత నీరు తాగి అనారోగ్యం బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. సాగ‌ర్ జ‌లాలు విడుద‌ల చేసిన నేప‌థ్యంలో నీరు వృధా కాకుండా చెరువుల‌ను నింపు కోవాల‌ని సూచించారు. ప‌లు ప్రాంతాలో కుళాయిల ద్వారా నీరు విడ‌ద‌ల కాని ప‌రిస్థితి ఉంద‌ని, ఆయ ప్రాంతాల‌లో ట్యాంక‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు.