రాజుల పాలనలో సమస్యలదే రాజ్యం!

  • వారు తలుచుకుంటే పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం ఏపాటిది?
  • ఎన్నికల హామీలకు పూర్ణపాడు లాభేసు వంతెనను వాడుకుంటున్నారు
  • గిరిజనులకు తప్పని డోలీల మోతలు
  • ఈ రోజుల్లో కూడా జ్వరాలకు పాముకాటుకు, దోమకాటుకు విద్యార్థులు, రక్త హీనత, ప్రసవ వేదనతో గిరిజన తల్లులు మృతి బాధాకరం
  • విద్య, వైద్యం, తాగునీరు, రోడ్డు సదుపాయాలు లేకపోవటం అన్యాయం
  • పూర్ణపాడు -లాభేసు వంతెన సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: రాజుల పాలనలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో జరుగుతున్న పూర్ణపాడు వంతెన సాధన కమిటీ రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలం అనాదిగా రాజుల పాలనలోనే ఉందన్నారు. అయినప్పటికీ సమస్యలదే ఇక్కడ రాజ్యమన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు వారు పూనుకుంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదన్నారు. పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణం అనేదాన్ని దశాబ్దాలుగా ఎన్నికల హామీలకే వాడుకున్నారన్నారు. లేదంటే వారు తలుచుకుంటే పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణం ఏ పాటిది అన్నారు. గిరిజన సమస్యలు పరిష్కారంలో తగు చొరవ చూపకపోవడం వల్ల ఇప్పటికి గిరిజనులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికీ గిరిజనులు మౌలిక సదుపాయాలకు నోచుకోక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఈ రోజుకి గిరిజన ప్రాంతాలకు రహదారి సదుపాయము లేక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లు కూడా వెళ్ళని పరిస్థితుల్లో డోలీల మోతలు తప్పడం లేదన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం నింగిని చేరి చంద్రమండలాన్ని తాకిన ఈ రోజుల్లో కూడా గిరిజనులు, గిరిజన విద్యార్థులు దోమకాటుకు, పాముకాటుకు బలవుతూ మృత్యువాత పడటం బాధాకరం అన్నారు. రక్తలేమితో, ప్రసవ వేదనతో గిరి తల్లులు అర్ధాంతరంగా నిండు నూరేళ్లు పూర్తి చేసుకోవడం విచారకరమన్నారు. ఈ రోజుకి విద్య, వైద్యం, తాగునీరు రోడ్డు సదుపాయం తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడం అన్యాయమన్నారు. మండలంలో నేటికి పూర్తికాని జంఝావతి, వనకాబడి గెడ్డ తదితర ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇక పార్వతీపురం నుండి ఒడిస్సా బోర్డర్ కూనేరు వరకు అంతర్ రాష్ట్ర రహదారి చూస్తే పాలకుల పరిపాలనకు మచ్చుతునక అన్నారు. కొమరాడ మండలంలోని తొమ్మిది పంచాయతీలు, సుమారు 60 గ్రామాల గిరిజనులకు అత్యవసరమైన పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేసుకోకపోవడం పూర్తిగా పాలకులు, అధికారుల అలసత్వమే అన్నారు. ఇటీవల కురుపాముకు వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి సైతం పూర్ణపాడు లాభేసు వంతెన సమస్య వెళ్లకపోవడం బాధాకరమన్నారు. గిరిజన పాలకులుగా ఉంటూ గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. లాభేసు వంతెన పూర్తి కాకపోవడం వలన ఏటా మృత్యువాత పడుతున్న, బాధలు పడుతున్న వారి సంఖ్య లెక్కలేనిదన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. సాధన కమిటీ కార్యాచరణకు జనసేన పార్టీ పూర్తిగా సహకరిస్తుందని తమ మద్దతు ప్రకటించారు.