దివ్వె వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం

అంతర్వేది ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యం లో పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్ లో ఓ దివ్వె వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ ధ్యానం చేశారు. ఆపై పవన్ దీపం వెలిగించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారందరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆయన అభిమానులు,జనసేన కార్యకర్తలు దీపాలు వెలిగించి తమ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా అంతర్వేది ఘటనపై ఏపీ సర్కార్ సీబీఐ విచారణను ఆదేశించింది. సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.

ఇక పవన్ పిలుపును పాటిస్తూ విశాఖపట్నం, నందిగామ, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, కైకలూరు తదితర ప్రాంతాల్లో జనసైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు.