పెరిగిన ఉల్లి విత్తనాల ధర

ఉల్లిగడ్డల ధరతో పాటూ విత్తనాల ధరలు కూడా భారీగా పెరిగాయి.  రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లిగడ్డలు కిలో రూ.70 నుంచి రూ.90 వరకు ధర పలుకుతుండడంతో విత్తనాల ధరలు కూడా పెరిగాయి. ఇంతకు ముందు ఉల్లి విత్తనాల రేటు కిలో రూ.2వేల నుంచి రూ.2200 ఉండగా.. ప్రస్తుతం కిలో రూ.4వేల నుంచి రూ.5వేల వరకు పెరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంట చేతికి వచ్చే సమయంలో నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లిగడ్డకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. మరోసారి పెద్ద ఎత్తున రైతులు ఉల్లిని సాగు చేసేందుకు ముందుకు వస్తుండడంతో వ్యాపారులు విత్తనాల రేట్లను పెంచారు. ప్రస్తుతం ఉల్లిపాయకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని నాసిక్‌కు చెందిన రైతు నానా సాహెబ్‌ తెలిపారు. దేశంలో ఉల్లిపాయ కొరత ఉందని, దిగుబడులు కూడా డిమాండ్‌కు సరిపోవడం లేదని పేర్కొన్నారు. వచ్చే సీజన్‌ తర్వాతే ధరలు సడలించే అవకాశం ఉంటుందని చెప్పారు. నాసిక్‌లో సుమారు 40వేల హెక్టార్లలో ఉల్లి సాగులో ఉందని జల్గావ్‌కు చెందిన శివదాస్‌ పాటిల్‌ పేర్కొన్నారు. గత సంవత్సరం రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, భారీ వర్షాలకు పంట ఎక్కువ భాగం దెబ్బతిందని చెప్పారు. నష్టాలు ఉన్నా ఖర్చులతో కొంత లాభం కూడా వచ్చిందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో ఎక్కువ రైతులు ఉల్లి సాగు వైపు మొగ్గు చూపుతున్నారని రైతు నాయకుడు విజయ్‌ జవాండియా తెలిపారు. అధిక ఉత్పత్తి, సరఫరాతో ధరలు తగ్గుతాయని ఆయన రైతులను హెచ్చరించారు. ఉల్లి సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని సూచించారు.