నా భారతం.. మహోన్నత ప్రజాస్వామ్య సౌధం.. ఐరాసలో మోదీ ప్రసంగం

 భారతదేశం అన్ని ప్రజాస్వామ్యాలకూ తల్లి వంటిదని, ఇందుకు ఒక రాజకీయ నేతగా తన రాజకీయ ప్రయాణమే ఉదాహరణ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్‌కు 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినా, దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని అన్నారు. శనివారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. కరోనా మహమ్మారితో మరణించిన వారికి నివాళితో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పర్యావరణ మార్పులు, పేదరిక నిర్మూలన, ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు, ఐరాస భద్రతా మండలి సంస్కరణలపై ఆయన మాట్లాడారు. తన ప్రసంగంలో ప్రధానంగా భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. మోడీతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షులు బైడెన్‌, ఉపాధ్యక్షులు కమలా హారిస్‌ ఇద్దరు నేతలు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు మానవ హక్కులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన నేపథ్యంలో మోడీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో నెలకొన్న వైవిధ్యమే తమ దేశ బలమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని మోడీ అన్నారు. ఒకప్పుడు టీ స్టాల్‌ వద్ద తన తండ్రికి సహాయం చేసిన ఒక చిన్న పిల్లవాడు నేడు ఐరాస జనరల్‌ అసెంబ్లీలో భారతదేశానికి ప్రధాన మంత్రి హోదాలో ప్రాతినిధ్యం వహిస్తుండటం భారత ప్రజాస్వామ్య బలాన్ని తెలియజేస్తోందని మోడీ పరోక్షంగా తన గురించి చెప్పుకున్నారు.
వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశామని, ఈ మహమ్మారిపై పోరులో భారత్‌ తగిన విధంగా స్పందించిందన్నారు. ప్రపంచానికి డిఎన్‌ఎ వ్యాక్సిన్‌ అందించిన తొలి దేశం భారత్‌ అని చెప్పారు. అంతర్జాతీయ కోవాక్స్‌ అలయెన్స్‌ ద్వారా తిరిగి ఎగుమతులు, వ్యాక్సిన్‌ ఎగుమతులు ప్రారంభించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పర్యావరణ మార్పులపై పోరుకు భారత్‌ పూర్తిగా కట్టుబడి ఉందని, 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించడంతోబాటు భారత్‌ను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మార్చాలన్నదే తమ సంకల్పం అన్నారు. భారత అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని చెప్పారు.
ఏ దేశం కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌ దుర్భలత్వాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి రాజకీయ అర్థాన్ని ఇస్తున్నాయని పాకిస్తాన్‌ పేరును ప్రస్తావించకుండా ప్రధాని మోడీ విమర్శించారు.