కరోనా విలయం.. సాయం అందించేందుకు రంగంలోకి దిగిన భారత సైన్యం

ప్రస్తుతం యావత్‌ భారత్‌ కరోనా కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ అందక ఎంతో మంది మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం తనవంతు సాయం అందించేందుకు రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా తాత్కాలిక వైద్యశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే.. ప్రధాని నరంద్రమోదీకి తెలిపారు. అంతేకాదు, ఆర్మీ ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు సేవలు అందించనున్నారు.

తాజా పరిస్థితుల్లో ఆర్మీ సన్నద్ధతపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆర్మీ చీఫ్‌ నరవణే సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణలో ఆర్మీ ఏవిధంగా సాయపడగలదన్న విషయాన్ని చర్చించారు. బాధితులు వైద్య సహాయం కోసం తమ ప్రాంతంలోని ఉన్న ఆర్మీ ఆస్పత్రిని సందర్శించవచ్చని సమావేశమనంతరం ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి భారత్‌కు వచ్చే ఆక్సిజన్‌ ట్యాంకర్లు, వాహనాల నిర్వహణకు సైన్యం తన వంతు సాయం చేస్తుంది. ఇదే విషయాన్ని జనరల్‌ ఎంఎం నరవణే.. ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు’ అని ఆర్మీ ప్రకటించింది.