ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం.. సిరీస్ కైవసం..

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిస్బేన్ టెస్ట్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో నాలుగవ టెస్ట్‌లో భారత్ విజయబావుటా ఎగురవేసింది. ఆస్ట్రేలియా తన రెండు ఇన్నింగ్స్‌లో 369, 294 పరుగులు చేసి అలౌట్ అవగా.. భారత్ 336 ఆలౌట్, 329/7 విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఇంతకాలం ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతున్న గబ్బా స్టేడియాలో టీమిండియా జబ్బ చరిచింది. ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌ బ్రిస్బేన్ అని చెబుతున్న చరిత్ర రికార్డులను తిరగరాసింది. 32 ఏళ్ల నాటి చరిత్రను తిరగరాస్తూ ఆసిస్‌కు ఓటమి రుచి చూపించారు భారత యువ క్రికెటర్లు. మొత్తంగా ఒక మ్యాచ్ డ్రా అవగా.. 2-1 తేడాతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

కోహ్లీ, రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, విహారీ వంటి సీనియర్ ప్లేయర్లు మ్యాచ్‌కు దూరమైనా.. యువ క్రికెటర్లు తమ సత్తా చాటారు. అసలు డ్రా అయితేనే గొప్ప అనుకున్న నాలుగో టెస్ట్‌లో ఘన విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించారు. భారత్ విజయంలో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, పుజారా కీలక పాత్ర పోషించారు. గబ్బా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ చివరి రోజున భారత బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతూనే తమ బ్యాట్స్‌ను ఝుళిపించారు. ఆసిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కంగారూలు విదిల్చిన లక్ష్యాన్ని చేధించారు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో రెండింట భారత జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాగా, చివరి మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్ 91 పరుగులతో పునాది వేయగా.. రిషబ్ పంత్ 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పుజారా 56 పరుగులు చేశాడు. ఇక హైదరాబాదీ అయినా సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆసిస్‌ను చావుదెబ్బ తీశాడు.