‘ధరణి’పై హైకోర్టులో విచారణ.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిగింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తాము ఇప్పటి వరకు ఎటువంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా, పిటిషినర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ప్రభుత్వాన్ని ధరణి వివరాలు మాత్రమే ఆపాలని కోర్టు సూచించిందని, అయితే ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్లను ఆపిందని తెలిపారు. కార్డ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగేవని, ప్రస్తుతం ఆ పద్ధతినే కొనసాగించాలని కోరారు. రిజిస్ట్రేషన్ సమయంలో ధరణి, ఆధార్ వివరాలు అడగవద్దని కోరారు. గతంలోనూ ధరణితో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేవని గుర్తు చేశారు. కాగా, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 16 కు వాయిదా వేసింది.