మేం అధికారంలోకి వస్తే జయ మృతిపై విచారణ: స్టాలిన్

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళనాడులో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఇప్పటి నుంచే మేనిఫెస్టోపై దృష్టి సారించింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్న నేపథ్యంలో ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దర్యాప్తు చేయిస్తామని పేర్కొంది. కోయంబత్తూరు జిల్లా దేవరాయపురంలో నిన్న నిర్వహించిన ప్రచార సభలో డీఎంకే చీఫ్ స్టాలిన్ మాట్లాడారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని గతంలో ఆరోపించిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. పళనిస్వామితో కలిసిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మంత్రి ఎస్‌పీ వేలుమణిపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్న స్టాలిన్.. తాను కనుక వాటిని నిరూపించలేకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.