ఆసక్తిగా మారీన తెలుగురాష్ట్రాల సీఎంల ఢిల్లీ టూర్.. లింకేంటి?

తెలుగురాష్ట్రాల  ముఖ్యమంత్రులు ఒకరు తర్వాత ఒకరుగా ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ .. ఇప్పటికే ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకుని వచ్చారు. ఆయన ఇలా రాగానే ఏపీ సీఎం జగన్.. హస్తినకు పయనమయ్యారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇలా ఒకరు తర్వాత ఒకరు ఢిల్లీ పెద్దలను కలవడం.. చాలా ఆసక్తిగా మారింది. ఇక ఇప్పటికే ముగిసిన కేసీఆర్ పర్యటనకు సంబంధించి పలు విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని.. ఆయన ప్రధాని మోడీని విన్నవించుకున్నార ని.. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వాలని అడిగారని అదేవిధంగా తాను కోరుకున్న ఐఏఎస్ ఐపీఎస్లను రాష్ట్రానికి కేటాయించాలని అమిత్ షాను అడిగారని ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ సీఎం పర్యటన పైనా కొన్ని వార్తలు వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు నివర్ తుఫాను నష్ట పరిహారం విడుదల పోలవరం పూర్తిపై ఆయన కేంద్రంతో చర్చించే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంలో నిజం ఎంత? నిజంగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం.. హుటాహుటిన ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లడం.. అక్కడ ప్రధాని హోం మంత్రి వంటి కీలక నేతలు అప్పాయింట్ మెంట్లు ఇవ్వడం వెనుక ఇంకేమీ లేదా? అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం. ఢిల్లీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. పైన చెప్పుకొన్న సమస్యలు ముఖ్యమంత్రుల పర్యటనలో భాగమై ఉంటే ఉండొచ్చని.. కానీ.. వాటి కోసమే వారు వచ్చారని.. చెప్పలేమని. అందునా.. ఇలాంటి వాటికి ప్రధాని హుటాహుటిన స్పందించే అవకాశం మాత్రం లేదని వెల్లడిస్తున్నారు. దీనివెనుక బలమైన రీజన్ ఉండే ఉంటుందని అంటున్నారు.

ఇక తాజాగా వెలుగు చూసిన కొన్ని పరిణామాలను గమనిస్తే.. సీఎంల పర్యటన వెనుక ఉన్న ఏవో కీలక రహస్యాలు ఉన్నాయనేందుకు బలం చేకూరుతోందని అంటున్నారు పరిశీలకులు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం యుద్ధ ప్రాతిపదికన భేటీ అయి.. సిఫారసులు సిద్ధం చేసింది. బహుశ.. ఇద్దరు ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటనకు ఇదే కారణమై ఉంటుందని అంటున్నారు. కొన్నాళ్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు హైకోర్టుల తీర్పులతో తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఇది కొంచెం ఎక్కువగా ఉన్నా.. తెలంగాణలోనూ తక్కువగా ఏమీ లేదు.

కీలకమైన `ధరణి`పథకానికి తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. కరోనా వైద్యం మరణాల విషయంలో కేసీఆర్ సర్కారుకు నిత్యం మొట్టికాయలు వేసింది. ఇక ఏపీ విషయంలో నిత్యం హైకోర్టు వర్సెస్.. ప్రభుత్వానికి వాదనలు వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ కావడం.. ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వంటివి సంచలనం రేపుతున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం మార్పుకు సిద్ధమైన నేపథ్యంలో అంతిమంగా కేంద్రం సిఫారసు కోసం.. సీఎంలు చక్రం తిప్పుతారని.. అందుకే వరుస పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు.