అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు భేటి కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆయన సమక్షంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఎంవోయూ ఒప్పందం జరగనుంది. కాగా, కొత్త ఒప్పందం కోసం కొన్ని నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

టీఎస్ఆర్టీసీ చెప్పిన విధంగా 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ అంగీకరించిన సంగతి విదితమే. అలాగే రూట్ల విషయంలోనూ తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ ఓకే చెప్పింది. దాని ప్రకారం విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ఆర్టీసీ కంటే టీఎస్ఆర్టీసీ ఎక్కువ బస్సు సర్వీసులు తిప్పనుంది.