IPL 2020 SRH VS KXIP: హైదరాబాద్ గెలుపుబాట

ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు బాట పట్టింది. ఏకంగా 69 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (97: 55 బంతుల్లో 7×4, 5×6), డేవిడ్ వార్నర్ (52: 40 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీలు బాదడంతో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. పంజాబ్‌ కింగ్స్ మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. రెండో ఓవర్లోనే మయాంక్‌ , ఐదో ఓవర్లో సిమ్రన్‌ సింగ్‌ .. ఔట్ అయ్యారు. మరి కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ కూడా వెనుదిరిగాడు. 58 పరుగులకే 3 వికెట్ల కోల్పోవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే నికోలస్‌ పూరన్‌ వరుస సిక్సర్లతో పంజాబ్‌లో ఆశలు రేపాడు. అబ్దుల్‌ సమద్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాదాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

అయితే పూరన్‌ జోరు కొనసాగించినప్పటికీ.. అవతలి ఎండ్‌లో ఎవరినీ నిలదొక్కుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. దీంతో.. 16.5 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.